దళపతి ఫోకస్ గులాబీ జోష్
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేనా
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎలాగైనా సరే సత్తా చాటాలని ఇప్పటికే గులాబీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కేవలం తక్కువ శాతంతో అధికారాన్ని కోల్పోవడంతో పార్టీకి చెందిన సీనియర్లు, నేతలు, కార్యకర్తలు , అభిమానులు డీలా పడ్డారు. దీంతో గులాబీ బాస్ కదన రంగంలోకి దూకాడు.
తెలంగాణ ప్రజలలో తనకు ఉన్న పట్టును గ్రహించారు. ఆదరణను ఓట్లుగా మల్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ సైతం ఊహించని రీతిలో కేసీఆర్ కు అడుగగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. నీరాజనాలు పలుకు తుండడంతో పెద్ద ఎత్తున జోష్ కలుగుతోంది గులాబీ దళంలో.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు కేసీఆర్. తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది పథంలోకి తీసుకు వచ్చాననే దానిపై ఆయన చెబుతూ ఉంటే జనం జేజేలు పలుకుతున్నారు. దీంతో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ ఎత్తున ఓట్లను చీల్చ బోతోందని, అది గెలుపు దిశగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.