మరింత బలోపేతం చేయాలని ఆదేశం
హైదరాబాద్ – చాన్నాళ్లకు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. తన అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. భారత దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా మనం చరిత్ర సృష్టించామని చెప్పారు. ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు వైఫల్యాలను ఎత్తి చూపాలని , ఎక్కడా తల వంచకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పార్టీకి చెందిన సీనియర్లు నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. రాబోయే ఏ ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు కేసీఆర్. ఇప్పటికే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టి పోయాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదన్నారు.