బీజేపీకి 200 సీట్లు రావు
మోదీకి అంత సీన్ లేదు
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి , దాని అనుబంధ పార్టీలకు కనీసం 200 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. ఆ పార్టీకి ఆశించిన సీట్లు రావన్నారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగనుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోదీ , అమిత్ షా చెబుతున్నట్లు 400 సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఆరు నూరైనా ఈసారి కేంద్రంలో పవర్ లోకి వచ్చేది, నిర్ణయాత్మక పాత్ర పోషించేది మాత్రం ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీకి కనీసం 14 సీట్లు వస్తాయని చెప్పారు కేసీఆర్. యువతీ యువకులు దయచేసి విలువైన ఓటును తమకు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ ను ఆదరించాలని, అత్యధిక స్థానాలలో, అత్యధిక ఆధిపత్యం నిలిచేలా చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే అశాంతి, అలజడి తప్ప ఏమీ ఒరిగేది ఉండదన్నారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలే గెలవడం ముఖ్యమని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ సందర్బంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పదేళ్ల బీజేపీ , 60 ఏళ్ల కాంగ్రెస్ గురించి ఆలోచించ వద్దని సూచించారు.