ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్దం
సమరానికి సై అంటున్న కేసీఆర్
హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రభుత్వం ప్రాజెక్టులపై అవగాహన లేకుండా వ్యవహరిస్తోందంటూ నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. మంగళవారం తెలంగాణ భవన్ కు తొలిసారిగా వచ్చారు. గతంలో సీఎంగా ఉన్న కాలంలో పదే పదే కనిపించే వారు. అత్యవసరమైతే తప్ప రాలేదు. తన పదేళ్ల కాలంలో ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పరిణతి చెంద లేదన్నారు. సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రజలు ఆయన భాషను క్షమించరని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. దీనిని ఏ ఒక్కరు హర్షించరన్నారు.
ఈనెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఈ సభ ఉంటుందని, లక్షలాది మంది ప్రజలను తరలించాలని పిలుపునిచ్చారు.
సీఎం కానీ ఆయన పరివారం కానీ లేదా కాంగ్రెస్ సర్కార్ ఒకవేళ అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే సభ జరిగి తీరుతుందన్నారు కేసీఆర్.