అంబేద్కర్ కు అవమానం కేసీఆర్ ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బాస్ ఫైర్
సంగారెడ్డి జిల్లా – తాను నిర్మించానని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయకుండా అవమానం చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన లిల్లీపుట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. .
తెలంగాణ ఆకాంక్షలు నెర వేరాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు. అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నామని తెలిపారు.
ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనే లేదన్నారు. కనీసం పూలు పెట్టలేదు..నివాళులు అర్పించ లేదని వాపోయారు. నేను నిర్మించానని అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లక పోవడం దారుణమన్నారు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా! యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా అని నిలదీశారు కేసీఆర్.
హామీలు అమలు చేయాలని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదన్నారు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నామని హెచ్చరించారు.