పట్టించినందుకే కక్ష కట్టిండు
రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన ఓ ఛానల్ తో ముఖా ముఖిలో పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వాళ్లకు సోయి లేదన్నారు. బట్ట కాల్చి మీద వేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
ఈ దేశ చరిత్రలో తెలంగాణ విస్మరించ లేని పదమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నంత దాకా తన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఎవరో తొలగిస్తే తొలగి పోయే పేరు కాదన్నారు కేసీఆర్. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని తాను ఉద్యమాన్ని నిర్వహించానని చెప్పారు.
వసతులు, వనరులు అపారమైనవి ఉన్నా వాడుకోలేని వాళ్లు ఈ దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ నేతలపై భగ్గుమన్నారు కేసీఆర్. అవగాహన లేమి, అసమర్థత కారణంగానే ప్రస్తుత ప్రభుత్వం కరెంట్ ను సరైన సమయంలో ఇవ్వలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కెమెరాల సాక్షిగా పట్టించినందుకే తనపై కక్షపెట్టుకున్నాడని , అవాకులు చెవాకులు పేలుతున్నాడని ధ్వజమెత్తారు. దేశ మార్కెట్ లో సీఎం విలువ లేకుండా చేశాడని ధ్వజమెత్తారు.