అదానీకి గేట్లు తెరిచిన రేవంత్
నేను ఉన్నంత దాకా రానీయలేదు
కరీంనగర్ జిల్లా – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. తాను సీఎంగా ఉన్నంత కాలం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని తెలంగాణలో కాలు పెట్టనీయ లేదని అన్నారు. కానీ ఎప్పుడైతే సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరారో అప్పటి నుంచి గేట్లు బార్లా తెరిచి ఉంచారంటూ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగరేణి సంస్థను గంప గుత్తగా పార్లమెంట్ ఎన్నికలు అయి పోయాక అదానీకి కట్ట బెట్టేందుకు ప్లాన్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేయడం జరిగిందని చెప్పారు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అవి గ్యారెంటీలు కావని గారడీలంటూ ఫైర్ అయ్యారు. రైతు బంధు, దళిత బంధు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. తాను ఉన్నంత వరకు 24 గంటల పాటు కరెంట్ ఇచ్చామని , కానీ కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక కరెంట్ కు కటకట ఏర్పడిందని మండిపడ్డారు కేసీఆర్.