కాంగ్రెస్ మోసం తెలంగాణకు శాపం
నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాలనా పరంగా ఐదు నెలలు పూర్తయిందని, ప్రస్తుతం ఆరవ నెలకు ప్రవేశించిన సర్కార్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అర్భకుడి లాగా తయారయ్యాడని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు.
అతి ప్రవర్తన, దుందుడుకు మాటలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు కేసీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. రైతు బంధు ఏమైందని ప్రశ్నించారు. తన మీద అక్కసు, కోపంతో అన్ని పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను బొంద పెట్టేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.
ఆనాడు తాను పవర్ లోకి వచ్చాక దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తీసుకు వచ్చిన ఆరోగ్య శ్రీని ఏనాడూ బంద్ పెట్టలేదని గుర్తు చేశారు. వ్యక్తిగత కోపం ఉంటే ఓకే కానీ తనమీద ఆగ్రహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.