ప్రత్యక్ష రాజకీయాలకు నాని గుడ్ బై
తప్పుకుంటున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ
అమరావతి – విజయవాడ మాజీ ఎంపీ , వైసీపీ సీనియర్ నాయకుడు కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. జాగ్రత్తగాఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
రెండు సార్లు విజయవాడ ప్రజలు తనను ఆదరించారని, అక్కున చేర్చుకున్నారని , పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని పేర్కొన్నారు కేశినేని నాని. ప్రజలు తన పట్ల కురిపించిన ప్రేమను ఎప్పటికీ మరిచి పోలేనని అన్నారు.
వారంతా బేషరతుగా తనకు అన్ని వేళల్లో అండగా నిలిచారని కొనియాడారు కేశినేని నాని. పేరు పేరునా ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా రాజకీయాల నుంచి దూరమైనా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు కేశినేని నాని.
తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అభివృద్దిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.