ఫిబ్రవరి 4వరకు కొనసాగుతుంది
ఆదిలాబాద్ జిల్లా – దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభమైంది. నాగోబాకు మైస్రం వంశీయులు మహా పూజ చేశారు. వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాగోబా జాతర సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా నాగోబా జాతరను పది రోజుల పాటు ఆదివాసీ గోండ్ తెగలకు చెందిన మేసారం, పార్ధన్ వంశాలు జరుపుకుంటారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది గిరిజనులు ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులను కేటాయించింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసంలో నాగోబా ఉత్సవం ప్రారంభమవుతుంది. మెస్రం తెగ ఆధ్యాత్మిక నాయకులు అమావాస్య రోజున అర్ధరాత్రి సమయంలో నాగోబాను పవిత్ర గోదావరి జలాలతో అభిషేకిస్తారు, పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. అమావాస్య రోజున గిరిజనులు తమ చనిపోయిన పూర్వీకులకు గౌరవ సూచకంగా ఆచారాలు నిర్వహించడం చాలా సందర్భోచితంగా భావిస్తారు.
మెస్రం గిరిజనులు నాగేంద్ర విగ్రహాన్ని తీసుకొని, డప్పులు, ఇతర గిరిజన వాయిద్యాల శబ్దాల మధ్య చాలా కోలాహలంగా ఆలయానికి చేరుకున్నారు.
ఆచారం ప్రకారం, మెస్రం గిరిజనులు సిరికొండ మండలం నుండి తెచ్చిన మట్టి కుండలకు పూజలు చేశారు. మెస్రం తెగకు చెందిన 22 వర్గాల మహిళలు తమ వంశానికి చెందిన గిరిజన పెద్దలు, మత పూజారులకు నమస్కరించి నాయక్‌పాడ్ నుండి మట్టి కుండలను స్వీకరించారు. తరువాత వారు వడమర సమీపంలోని సరస్సు నుండి నాగోబా ఆలయానికి పవిత్ర జలాన్ని తీసుకువచ్చారు.