రైతులు..మహిళలకు అండగా ఉంటా
కిల్లర్ వీరప్పన్ కూతురు విద్యా రాణి
తమిళనాడు – గంధపు చెక్కల స్మగ్లర్ దివంగత కిల్లర్ వీరప్పన్ కూతురు విద్యా రాణి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. ఆమె ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని స్పష్టం చేశారు.
అదేమిటంటే కృష్ణగిరి లోక్ సభ స్థానం నుంచి తాను ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నానని, అందుకే ప్రజలందరి తరపున తన వాయిస్ వినిపించేందుకు గెలిపించాలని కోరారు. ప్రధానంగా నామ్ తమిళర్ కట్చి పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. ఇవాళ టికెట్ ఇవ్వకంటే ముందు నుంచే తాను ఈ నియోజకవర్గంలో కలిసి పోయానని తెలిపారు విద్యా రాణి.
ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని తనకు పార్టీ కల్పించిందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం , మహిళా సాధికారత కోసం తాను పని చేస్తానని ప్రకటించారు ఆమె. ఈ దేశంలో అన్ని పార్టీలు ఈ రంగాలకు చెందిన వారిని పట్టించు కోవడం మానేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గానికి విశిష్టమైన రీతిలో సేవలు అందజేస్తానని హామీ ఇచ్చారు.