మరోసారి ఆప్ దే అధికారం
ఢిల్లీ – ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా బీజేపీ గెలుస్తుందని ప్రకటించాయి. కానీ ఏపీ, తెలంగాణకు చెందిన కేకే సర్వే మాత్రం సంచలన రిపోర్ట్ వెల్లడించింది. దేశ రాజధానిలో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఆప్ కు 44 సీట్లు, బీజేపీకి 26 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు.
ఢిల్లీలో బీజేపీకి ఆశించిన ఫలితాలు రావంటూ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్ట బోతోందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్సీపీ భారీ ఎత్తున రెండోసారి అధికారంలోకి రాబోతోందంటూ ప్రకటించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పవర్ లోకి వచ్చింది. వైసీపీకి కేవలం 11 సీట్లకే పరిమతమైంది.
కాగా కేకే సర్వే ఒక్కటే ఏపీలో కూటమి సర్కార్ వస్తుందని, ఇది పక్కా అని ప్రకటించింది. కేకే చెప్పిందే నిజమైంది. దీంతో ఏపీలో వర్కవుట్ కావడంతో ఢిల్లీలో సైతం కేకే సర్వే తప్పకుండా నిజం కాబోతోందంటూ ఆప్ నేతలు పేర్కొంటున్నారు.