అందెశ్రీకి కోదండరాం బాసట
కీరవాణి సంగీతం అందిస్తే తప్పేంటి
హైదరాబాద్ – తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత కొన్ని రోజుల నుంచి కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది.
దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇదే సమయంలో పాటకు సంబంధించి ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంఎం కీరవాణి చేత స్వర కల్పన చేయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో యావత్ సమాజం తప్పు పట్టింది. సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాను రాను తెలంగాణ ప్రాంతంలో దాని అస్తిత్వం లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందంటూ గాదె ఇన్నయ్య సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కీరవాణి కంటే మంచి సంగీత దర్శకుడు ఎవరు ఉన్నారంటూ కవి అందెశ్రీ చెప్పడం మరింత ఆజ్యం పోసినట్లయింది. అందెశ్రీనా లేక ఆంధ్రా శ్రీనా అంటూ మరో గాయకుడు మండి పడ్డారు.
ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారంపై కోదండరాం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. తన గీతానికి మంచి సంగీతం అందించాలని కవి కోరుకున్నాడని , ఎవరు పాడారన్నది కూడా చర్చ అనవసరమని పేర్కొన్నారు. మొత్తంగా అందెశ్రీకి వంత పాడడం విస్తు పోయేలా చేసింది.