కోడంగల్ రైతులకు అండగా ఉంటాం
భూములు గుంజుకుంటే ఊరుకోం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడంగల్ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలోని హకీంపేట్, పోలేపల్లి, లకచర్ల గ్రామాలకు చెందిన రైతులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ ను కలుసుకున్నారు.
సీఎం ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఈ విషయంలో తమను ఆదుకోవాలని కోరారు బాధిత రైతులు. దుద్యాల్ మండల పరిధిలోకి వచ్చే ఈ గ్రామాల రైతులు తీవ్ర ఆవేదన చెందారు. కన్నీటి పర్యంతం అయ్యారు.
3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని చెప్పినా వినిపించు కోవడం లేదన్నారు. సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన చెందారు.
లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు రైతులు.
వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమే జీవనాధారం అని… ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.