DEVOTIONAL

ఘ‌నంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Share it with your family & friends

మే 22 నుండి 24వ తేదీ వరకు వసంతోత్సవాలు

తిరుమ‌ల‌ – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు.

అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు.

అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మ‌వారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

ఉత్స‌వాల కార‌ణంగా మే 21 నుండి 24వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 23న తిరుప్పావ‌డ సేవ‌, మే 24న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ సుభాష్‌ పాల్గొన్నారు.