DEVOTIONAL

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో

తిరుపతి – తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.

అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు.

అక్టోబ‌రు 30వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీవారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మ వారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ పుండరీకవల్లి అమ్మ వారు, శ్రీ భాష్యకారుల వారికి, తైల సమర్పణ నిర్వహించనున్నారు.

అక్టోబర్ 31న సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు దీపావళి ఆస్థానం వైభవంగా జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మ వారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్‌ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.