తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అష్టదళ పాద పద్మారాధన..వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల – తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న దృష్ట్యా మంగళవార ఘనంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని అష్టదళ పాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది.
తమిళంలో కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’. ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి, ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం.
ఈ సమయంలో అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను గర్భ గుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు. శ్రీవారి ప్రధాన మూర్తికి కూడా ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరిగింది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల దేవతలు, దీపం మరియు ఇతర పూజ వస్తువులను మరల లోనికి తీసుకొచ్చారు . అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించారు.
ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించారు. సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకను నిర్వహించడం ఆనవాయితీ .