10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం 7 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.