DEVOTIONAL

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Share it with your family & friends

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో

తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టిటిడి జెఈవోలు గౌతమి, వీర‌బ్ర‌హ్మం పాల్గొన్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మ వారిని మేల్కొలిపి సహస్ర నామార్చ‌న, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌ను ర‌ద్దు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆలయానికి హైదరాబాదుకు చెందిన స్వ‌ర్ణ‌కుమార్ రెడ్డి ఆరు పరదాలు, రెండు కురాళాలు, తిరుపతికి చెందిన సుధాకర్, జయ చంద్రారెడ్డి, అరుణ్ కుమార్ నాలుగు పరదాలు, 25 హుండీ వస్త్రాలు విరాళంగా జేఈఓ వీరబ్రహ్మంకు అందించారు.

శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్ర‌హ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఆల‌య మాడ వీధుల్లో వాహన సేవలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చ‌కులు బాబుస్వామి, ఆలయ అర్చకులు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.