DEVOTIONAL

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

Share it with your family & friends

16 నుంచి ర‌థ స‌ప్త‌మి

తిరుమ‌ల – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఘ‌నంగా జ‌రిగింది. ఈనెల 16న ర‌థ స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని దీనిని నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాదుకు చెందిన భ‌క్తురాలు స్వ‌ర్ణ‌కుమారి అందించిన ప‌ర‌దాల సెట్‌ను ఆల‌యంలో అలంక‌రించారు.

          ఫిబ్ర‌వరి 16న ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి అమ్మ‌వారు భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. 

మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

             కాగా మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే అభిషేకానంత‌ర ద‌ర్శ‌నం, ల‌క్ష్మీపూజ‌, ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌సేవ‌, వేదాశీర్వ‌చ‌నం సేవలను టీటీడీ రద్దు చేసింది.

          తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.