DEVOTIONAL

7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Share it with your family & friends

శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వ‌హ‌ణ

తిరుమ‌ల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలను పుర‌స్క‌రించుకుని 7వతేదీ మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.

ఈ సమయంలో స్వామివా రి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.

అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *