శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో
తిరుపతి – జనవరి 10వ తేది వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏ.పి.శ్రీనివాస దీక్షితులు, ఏఈవో కె.ముని కృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.