Saturday, April 19, 2025
HomeDEVOTIONALశ్రీవారి ఆలయంలో తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.

సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకు ని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.

కాగా స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.

ఆ తరువాత స్వామి వారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వ దర్శనం ప్రారంభించారు.

ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments