విద్యార్థుల నిరసన మమత ఆందోళన
బలవంతంగా పోలీసుల లాఠీఛార్జ్..టియర్ గ్యాస్
పశ్చిమ బెంగాల్ – కోల్ కతాలోని ఆర్జే కర్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ రేప్ , హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ట్రైనీ డాక్టర్లు ఆందోళన విరమించారు. అయినా ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది.
మరోసారి విద్యార్థులు రోడ్డెక్కారు. ట్రైనీ డాక్టర్ విషయంలో నిందితుడిని రాష్ట్ర టీఎంసీ ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు విద్యార్థులు.
విద్యార్థుల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఎక్కడ చూసినా పోలీసులు మోహరించారు. లాఠీ ఛార్జి ప్రయోగించారు. భాష్ప వాయువులను వాడడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆందోళనకారులను సీఎం కార్యాలయం వైపు వెళ్ల నీయకుండా పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు.
విద్యార్థులపై బలవంతం చేయొద్దంటూ రాష్ట్ర గవర్నర్ సీఎం మమతా బెనర్జీని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం రాజీనామా చేసేంత దాకా తాము ఆందోళన విరమించ బోమంటూ ప్రకటించారు విద్యార్థులు.