పారిశ్రామిక హబ్ గా అనకాపల్లి – కొల్లు రవీంద్ర
అవకాశం కల్పించిన సీఎంకు ధన్యవాదాలు
అమరావతి – రాబోయే రోజుల్లో అనకాపల్లిని పారిశ్రామిక హబ్ గా మారుస్తామని అన్నారు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర. సోమవారం అనకాపల్లిలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర రాజకీయాల్లో అనకాపల్లికి ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.
అలాంటి ప్రాంతంలో పని చేసే అవకాశం కల్పించిన సిఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కుంటున్నట్లు చెప్పారు. రాక్షస పాలన వద్దు.. ప్రజా పాలన కావాలని పోరాడి ప్రజలు సాధించుకున్న ప్రభుత్వం ఇది అన్నారు కొల్లు రవీంద్ర.
గత ఐదేళ్ల కాలంలో ప్రజలు పడిన కష్టాలకు మొన్నటి ఫలితాలు నిదర్శనం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 94 శాతం సీట్లు ప్రజలు కూటమికి ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ,సిఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పోలవరం, రైల్వే సహా అనేకమైన పనుల్ని సాధించుకున్నామని చెప్పారు కొల్లు రవీంద్ర.
బీజేపీ, జనసేన, టీడీపీ నేతలంతా కలసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మరో రెండు దశాబ్దాల పాటు కూటమి అధికారంలో ఉండాలనీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నాడు సిఎం చంద్రబాబు ఇచ్చిన విజన్ నేడు ఎలాంటి ఫలాలు ఇస్తోందో చూశామన్నారు. అదే స్ఫూర్తితో నేడు కూడా విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు మంత్రి.