దేశంలోనే ఏపీని అగ్రగామిగా చేస్తాం
సమాచార శాఖ మంత్రి పార్థసారథి
అమరావతి – దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచేలా చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర సమాచార , పౌర సంబంధాల , గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. శుక్రవారం ఆయన సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపు కలిగిన వ్యక్తి అని, ఆయన అడుగు జాడల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లేలా తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో సమాచార, పౌర సంబంధాల శాఖ సఫలీకృతమయ్యేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కొలుసు పార్థ సారథి స్పష్టం చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వినూత్న విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భిన్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.