రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం
ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రేపు చెక్కు పంపిస్తామంటూ పేర్కొన్నారు. సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఇదిలా ఉండగా దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. నటుడు అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. తన కారణంగానే చని పోయారని ఆరోపించారు. అల్లు అర్జున్ కు ఏమైందని పరామర్శించారని ప్రశ్నించారు.
బన్నీ ఇంటికి క్యూ కడుతున్న సెలబ్రిటీలు శ్రీతేజ్ ను ఎందుకు పరామర్శించ లేదన్నారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా , కాళ్లు పోయినవా, కిడ్నీలు పాడై పోయాయా అని మండిపడ్డారు. ఆయన ఏమైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడా అని మండిపడ్డారు. ఒక్క రోజు జైలుకు వెళ్లి వచ్చినందుకే ఇలా పరామర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.