హీరో హీరోయిన్లకు ప్రత్యేక రూల్స్ ఉండవు
స్పష్టం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోస్ , సినిమా టికెట్ల ధరలు పెంచడం కుదరదని పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప -2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ‘పుష్ప 2’ ఏమైనా స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా? అని ప్రశ్నించారు. ఈ సినిమాను తాను కూడా చూశానని చెప్పారు. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు.
ఇకపై చారిత్రక, భక్తి, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడాలని అనుకోవడం లేదని కుండ బద్దలు కొట్టారు. మూడున్నర గంటల సమయంలో చాలా పనులు చేసుకోవచ్చని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సినిమాలతో యువత కూడా చెడి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరైనా ఏ రంగానికి చెందిన వారైనా ప్రధానంగా సినీ రంగానికి చెందిన హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు . ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు.