కేసీఆర్ ఖేల్ ఖతం
కోమటిరెడ్డి కన్నెర్ర
నల్లగొండ జిల్లా – రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రపంచంలో భూమి ఆకాశం ఉన్నంత దాకా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పనై పోయిందని, అవాకులు చెవాకులు పేలడం తప్ప ఆయన రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాస్తవాలను కప్పి పుచ్చేలా సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఇంకేముందని ప్రశ్నించారు .
ఒక రకంగా చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం కాక తప్పదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డామని అన్నారు. ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలను ప్రకటించామని, ఇందులో 5 గ్యారెంటీలను 100 శాతం అమలు చేశామని చెప్పారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ఇప్పటికే తమ సీఎం రేవంత్ రెడ్డి పంధ్రాగష్టు లోపు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ తీసుకున్న రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసి తీరుతామన్నారు. తను పదేళ్ల కాలం పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. ఖాళీ ఖజానా తమ చేతికి ఇచ్చాడని , ఇక ఏం ముఖం పెట్టుకుని తిరుగుతాడంటూ ఎద్దేవా చేశారు.