కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మనసులోని మాట బయట పెట్టారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ హైకమాండ్ ప్రకటించడంతో తను కూడా రేసులో ఉన్నానని ప్రకటించారు. అయితే ఏ మంత్రి పదవి ఇచ్చినా తాను తీసుకోనని అన్నారు. కేవలం హోం శాఖ మంత్రి పదవి ఇస్తేనే తీసుకుంటానని స్పష్టం చేశారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలన్నారు. భువనగిరి ఎంపీగా బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించానని అన్నారు. ఆ తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఆయా సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను పిలిపించింది పార్టీ హైకమాండ్. ఈ సందర్బంగా ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేసింది. అంతే కాకుండా ఆరుగురు మంత్రులతో పాటు ఇంకా మిగిలి పోయిన నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉండగా మరొకరికి ఎలా ఇస్తారంటూ పార్టీలోని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.