భౌతిక దాడులకు తావు లేదు
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ ఇంటిపై కొందరు రాళ్లతో దాడి చేయడాన్ని ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించ కూడదని అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందన్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఇదే సమయంలో తను కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. తను సీఎం రేవంత్ రెడ్డి పట్ల చేసిన కామెంట్స్ ను ఖండించారు. అంతే కాదు బేషరతుగా సీఎంకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు.
గతంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించే వారని గుర్తు చేశారు. కానీ అల్లు అర్జున్ తానేదో గొప్ప వ్యక్తినని ఫీలవుతున్నారని దానిని మానుకుంటే మంచిదని సెలవు ఇచ్చారు. ఏది ఏమైనా ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, అందుకే తాను కూడా మాట్లాడటం మంచిది కాదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.