ఎస్ఎల్బీసీకి కేసీఆర్ పైసా ఇవ్వలేదు – కోమటిరెడ్డి
కావాలని నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏకి పారేశారు. సోమవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా తాను కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒక్క పైసా కూడా కేటాయించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల కోట్లు ఖర్చు చేశాడని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఇచ్చిన మాటను తప్పని నాయకుడినంటూ ఆనాడు ఎన్నో ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, గత బీఆర్ఎస్ హయాంలో కేవలం దోచు కోవడంపైనే దృష్టి పెట్టారని , ప్రజల సంక్షేమం గురించి ఏనాడైనా పట్టించు కున్నారా అని నిలదీశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ గనుక రూ. 2,000 కోట్లు ఎస్ఎల్బీసీకి కేటాయించి ఉంటే ఇప్పుడు ఇంతటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కావన్నారు. నవంబర్, డిసెంబర్ లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలు ప్రారంభిస్తామని ప్రకటించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.