కేసీఆర్ క్షమాపణ చెబితేనే రానిస్తాం
వార్నింగ్ ఇచ్చిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈనెల 13న నల్లగొండలో ఏం ముఖం పెట్టుకుని వస్తావని ప్రశ్నించారు. దేని కోసం నీ సభ పెడుతున్నావో చెప్పాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ పేరు చెప్పి దోచుకుని దాచుకున్నావని, ప్రజల రక్తం తాగావంటూ ఆరోపించారు. రైతులు మౌనంగా లేరని, వస్తే నిరసన ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు కోమటిరెడ్డి.
ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్లగొండకు రావాలన్నారు. లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత, నైతిక హక్కు కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావులకు లేనే లేదన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
నల్లగొండ, దక్షిణ తెలంగాణను ఎడారి చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్‌నించారు. జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కై కృష్ణా జలాలను ఏపీకి ధారదత్తం చేశాడని ఆరోపించారు. మునిగి పోయే ప్రాజెక్టులను కట్టి లక్షల కోట్లు దోచుకున్నారంటూ వాపోయారు. ప్రాజెక్టుల పేరుతో మోసం చేశారని, బడ్జెట్ ను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు కోమటిరెడ్డి.