నీళ్లిచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
సవాల్ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – గత పదేళ్ళలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. కేవలం 14 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.
అందులో ఐదారుసార్లు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందన్నారు. తమ వద్ద లాగ్ బుక్ ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాను ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా తీశానని అన్నారు. ఇదే సమయంలో తాను తనిఖీ చేస్తున్నానని తెలుసుకున్న ఆనాటి సర్కార్ రాత్రికి రాత్రి అన్ని జిల్లాల నుంచి వాటిని హైదరాబాద్ కు తెప్పించుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
విచిత్రం ఏమిటంటే కేవలం 24 గంటల కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ నేతలు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆనాడు స్వంత ముఖ్యమంత్రినే తాను నీళ్ల కోసం, అన్యాయం గురించి నిలదీసిన సంఘటనలు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హరీశ్, కేటీఆర్ లు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.