ఐ ప్యాక్ టీం వల్లే ఓడి పోయాం
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి – మాజీ మంత్రి , వైసీపీ సీనియర్ నాయకుడు కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా మాజీ సీఎం, పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేయడం కలకలం రేపింది. మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.
తమ నాయకుడు జగన్ తమను పట్టించు కోలేదని వాపోయారు. ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ఒక రకంగా పూర్తిగా పక్కన పెట్టేశారని, కొందరు మాత్రమే అధికారాన్ని చెలాయించారని ఆరోపించారు. అంతే కాకుండా ఆయన ఐ ప్యాక్ టీంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినధులకు, నేతలకు సముచిత స్థానం కల్పించక పోవడం కూడా తమను దెబ్బ తీసిందన్నారు కొట్టు సత్యనారాయణ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను జగన్ మోహన్ రెడ్డి పక్కన పెట్టడం, ఐ ప్యాక్ టీంను నెత్తికి ఎక్కించు కోవడం వల్లనే తాము ఓటమి పాలయ్యామని సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలే తమ కొంప ముంచాయంటూ ఫైర్ అయ్యారు. ఐ ప్యాక్ సంస్థ పనికి మాలిన సంస్థ అంటూ మండిపడ్డారు. దానిని నమ్ముకుంటే చివరకు చిప్పే మిగిలిందన్నారు.