తెలంగాణకు 131 టీఎంసీలు..ఏపీకి 27 టీఎంసీలు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలు మిగిలి ఉన్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తేల్చింది. వచ్చే జూన్, జూలై నాటికి ఏర్పడే తాగు, సాగునీటి అవసరాలను వాటా జలాలతో తీర్చుకోవడంపై ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.వరలక్ష్మీ ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్‌సీలకు లేఖ రాశారు.
ఇదిలా ఉండగా ఏపీ 639.652 టీఎంసీలు వాడుకుంది. ప్రస్తుత ఏడాది సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు జరపాలని గత జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. కృష్ణా బేసిన్‌లో ప్రస్తుత నీటి సంవత్సరంలో 1010.134 టీఎంసీల జలాలు లభ్యతలోకి రాగా తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని పేర్కొంది.
ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి 207 టీఎంసీలు తరలించిన ఏపీ గతేడాది నవంబర్ 25న 15.86 టీఎంసీలు, గత జనవరి 31న మరో 18 టీఎంసీలు కలిపి మొత్తం 33.86 టీఎంసీలను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేయాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది.
దీనికి తోడు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, హంద్రీ నీవా, ముచ్చుమరి ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలించిందని పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ ఏడాది ఏపీ రికార్డు స్థాయిలో 207.88 టీఎంసీ జలాలను తరలించుకుంది. హంద్రీ నీవా, ముచ్చుమర్రి, తదితర ప్రాజెక్టులు కలిపి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ మొత్తం 236.63 టీఎంసీలను తరలించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించు కోగలిగింది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు కలిపి మరో 324.2 టీఎంసీలను ఏపీ వాడుకుంది.
2025 ఫిబ్రవరి –జూలై మధ్యకాలంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్పీలకు 116 టీఎంసీల విడుదల కోసం తెలంగాణ ఇండెంట్ పెట్టిందని కృష్ణా బోర్డు తెలిపింది. నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులకి పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకి పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వాడుకున్న జలాలతో పాటు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని జలాల వినియోగంపై ప్రణాళికలు సమర్పించాలని కోరింది.
ప్రస్తుత సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాడుకున్న కృష్ణా జలాల వివరాలను కృష్ణా బోర్డు లేఖలో పొందుపరిచింది.