Saturday, April 19, 2025
HomeNEWS29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ - కేటీఆర్

29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ – కేటీఆర్

కేసీఆర్ ఉద్య‌మం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న‌వంబ‌ర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.

33 జిల్లా కేంద్రాల‌లో దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తామ‌న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను కేసీఆర్ ఎగుర వేశార‌ని అన్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగి పోని సంతకం చేసిన మ‌హా నాయ‌కుడు అని పేర్కొన్నారు కేటీఆర్.

తెలంగాణ ఉద్య‌మాన్ని మ‌లుపు తిప్పిన సంఘ‌ట‌న న‌వంబ‌ర్ 29, 2009 అని గుర్తు చేశారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచి పోయే శుభదినం అన్నారు . ఆనాడు “కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ తెచ్చుడో” అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ అన్నారు. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందన్నారు.

మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు కేటీఆర్. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరునిపై ఉందన్నారు కేటీఆర్.

కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక్క వర్గం కాదు.. సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధ పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడు కోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments