వైఫల్యాలపై గులాబీ యోధులు ఫోకస్ పెట్టండి
పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉండాలని, ఇందుకు కసరత్తు చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు.
ఎక్కడా సంయమనం కోల్పోకుండా కలిసికట్టుగా సమస్యలను మాత్రమే ప్రస్తావించాలని, వ్యక్తిగత దూషణలకు దిగవద్దని సూచించారు. ఇదే సమయంలో ప్రజల మధ్యకు వెళ్లాలని, వారు పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని, వారి తరపున తాము గొంతు విప్పాలని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం సర్కార్ వైఫల్యాలను, సీఎం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడను బహిరంగంగానే ఏకి పారేస్తోందన్నారు. దీంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఏదో రకంగా బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారి కుట్రలు, కుతంత్రాలు చెల్లవని స్పష్టం చేశారు కేటీఆర్.
గత రెండు రోజులుగా మనం చూసినది రాజకీయ ప్రతీకార యుద్ధానికి నాంది మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు, కష్టాలు వస్తాయని, అందుకు అందరూ సిద్దమై ఉండాలని తెలిపారు. దుర్మార్గపు వ్యక్తిగత దాడులు, కుట్రలు, బూటకపు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.