బాధితులకు బీఆర్ఎస్ భరోసా – కేటీఆర్
ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం
హైదరాబాద్ – హైదరాబాద్ లోని మూసీ పరివాహక నిర్వాసితులతో పాటు హైడ్రా దెబ్బకు బాధితులుగా మారిన వారంతా బుధవారం తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు. వారిని అక్కున చేర్చుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ టీమ్ తో బాధితులకు సంబంధించిన వివరాలు నమోదు చేయించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి కేటీఆర్ బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. మీరు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. తాము ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తొందరపడి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని పేదలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
ఇప్పటికే హైడ్రా ఒంటెద్దు పోకడను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టిందని, అయినా తన పనితీరు కమిషనర్, సీఎం రేవంత్ రెడ్డి మార్చు కోవడం లేదంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు బాధితుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఖర్చు లేకుండా పార్టీనే భరించి న్యాయ సహాయం చేస్తుందని ఈ సందర్బంగా ప్రకటించారు కేటీఆర్.