నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
జడ్జి ముందు మాజీ మంత్రి వాంగ్మూలం
హైదరాబాద్ – తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన జడ్జి ముందు తన వాంగ్మూలం ఇచ్చారు.
సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మంత్రి సురేఖ తన స్థాయి మరిచి వ్యాఖ్యలు చేశారని, ఇది తనను ఎంతగానో బాధ పెట్టిందన్నారు. ఇదే సమయంలో తన కుటుంబం కూడా ఇబ్బంది పడిందని తెలిపారు.
ఒక మహిళగా సాటి మహిళ పట్ల గౌరవాన్ని కలిగి ఉండాల్సింది పోయి , అత్యంత నీచమైన భాషను ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే కొండా సురేఖ ఏం మాట్లాడారో మీరైనా చెప్పగలరా అని జడ్జి అడిగారు.
ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిగా తాను మీ ముందు చెప్పలేనని, ఇప్పటికే కొండా సురేఖ మాట్లాడిన మాటలు దేశమంతటా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని తెలిపారు. అయితే మంత్రి తన స్థాయికి దిగిజారి నటి సమంతపై వాడిన మాటలను తాను నోటితో చెప్పలేక రాత పూర్వకంగా మీ ముందు సమర్పిస్తున్నానని స్పష్టం చేశారు కేటీఆర్.