బుల్డోజర్ రాజ్ నహీ ఛలేగా – కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మంగళవారం అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని గోల్నాకలోని తులసీ నగర్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఆనందం లేకుండా చేస్తున్నాడని సీఎంపై నిప్పులు చెరిగారు. ఎప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేస్తారోనని పేదలు భయంతో ఆందోళనలో ఉన్నారని వాపోయారు.
హైదరాబాద్లో ప్రజలు ఓట్లు వేయలేదని పగబట్టి పేదోళ్ల ఇళ్లను కూల్చివేస్తున్నాడని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండో గుర్తు చేసుకోవాలని అన్నారు.
రైతులకు, మహిళలకు, వృద్ధులకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అయ్యాయని నిలదీశారు .
మూసీ మే లూటో.. ఢిల్లీ మే బాటో అన్నట్లు ఉంది ఈ కాంగ్రెస్ వైఖరి అని మండిపడ్డారు. మూసీలో 55 కిలోమీటర్లకు రూ. లక్షా 50 వేల కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తారంట ఇది అతి పెద్ద విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్ .
మీ ఇళ్ల మీదికి బుల్డోజర్ వస్తే మీరంత ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కట్టిస్తామన్నారని, కానీ ఇళ్లు కూల్చి వేస్తే ఎలా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లను బొందల గడ్డలు చేసి అక్కడ మాల్లు కడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.