సీఎం..దమ్ముంటే పల్లెల్లోకి..రా – కేటీఆర్
సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే రుణ మాఫీపై సెక్యూరిటీ లేకుండా ఊర్లల్లోకి రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో కలిసి డీజీపీ జితేందర్ ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు చేస్తున్న దాడుల గురించి ఏకరువు పెట్టారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో రైతులకు ఇప్పటి వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేయలేదని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎంగా కొలువు తీరాక ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతోనే సరి పోయిందని, ఇక పాలన ఎక్కడుందని ప్రశ్నించారు.
రుణ మాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అబద్దాలు చెబుతోందని ఆరోపించారు కేటీఆర్. మొత్తం రూ. 48,000 కోట్లు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 17 వేల కోట్లు కూడా జమ చేయలేదని అన్నారు. ఓ వైపు లక్షలాది రైతులు రగిలి పోతుంటే.. వారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఢిల్లీ బాట పట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఎన్నికలప్పుడు గాలి మాటలు చెప్పాడని, గద్దెనెక్కాక గాలి మోటర్లలో తిరుగుతున్నాడని సీఎంపై సెటైర్ వేశారు.