NEWSTELANGANA

రైతన్న‌ల అరెస్ట్ అప్ర‌జాస్వామికం

Share it with your family & friends

ఆవేద‌న వ్య‌క్తం చేసిన కేటీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని దుద్యాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల గ్రామ‌స్థుల‌ను అకార‌ణంగా అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు.

అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేర‌ని, బెదిరింపులతో రైతులను భయ పెట్టలేరని అన్నారు కేటీఆర్. ఎక్స్ వేదిక‌గా స్పందించారు . అర్దరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్ర‌జా పాల‌న అని నిల‌దీశారు.

రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కేటీఆర్.

అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతులను అరెస్ట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం..భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్ట వద్దన్నందుకు అరెస్టులా?

రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.
లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్ర‌క‌టించారు.