గులాబీ నేతల అరెస్ట్ అక్రమం – కేటీఆర్
సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం ఇవాళ చేస్తున్న మూసి పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతీసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు కేటీఆర్.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్.
నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి లను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.