కవిత అరెస్ట్ అప్రజాస్వామికం
మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. ఆయన ఈడీ అధికారులతో తీవ్ర వాగ్వావాదానికి దిగారు. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈడీ ఆఫీసర్స్. కేసు కూడా నమోదు చేసింది దర్యాప్తు సంస్థ.
ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్ర సర్కార్ కుట్ర పన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. గత పది ఏళ్లుగా మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తూ వచ్చిందని , అయినా తాము లొంగ లేదని పేర్కొన్నారు. కవిత అరెస్ట్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాన మంత్రి మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందనేది తన సోదరి అరెస్ట్ విషయంలో రూఢీ అయ్యిందని అన్నారు కేటీఆర్. మనీ లాండరింగ్, లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందని, ఇంకా దీనిపై తుది తీర్పు వెలువడలేదని , అంతలోనే ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు . దీనిపై తాము న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు మాజీ మంత్రి కేటీఆర్.