జర్నలిస్ట్ పై దాడి దారుణం – కేటీఆర్
అపస్మారక స్థితిలో చిలుక ప్రవీణ్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చే జర్నలిస్టులపై దాడులకు దిగడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తాజాగా జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై విచక్షణా రహితంగా కాంగ్రెస్ చెందిన వారు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్.
ఇదేమీ రాజ్యం? ఇదేమీ దౌర్జన్యం? ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయటమేనా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు రాష్ట్ర సర్కార్ ను.
ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజలు ఎవరు ప్రశ్నించిన ఎందుకింత అసహనం అని ప్రశ్‌నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక వరుసగా జర్నలిస్ట్ లపై దాడులు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
ప్రజల గొంతుకగా, ముఖ్యంగా దళిత బహుజన వర్గాల సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.