మహిళా క్రికెట్ లో సెన్సేషన్
హైదరాబాద్ – కౌలాలంపూర్ వేదికగా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తెలంగాణ బిడ్డ త్రిష గొంగిడి చరిత్ర సృష్టించింది. కేవలం 53 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. రికార్డ్ బ్రేక్ చేసింది. మహిళా క్రికెట్ చరిత్రలో తనదే రికార్డ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. భవిష్యత్తులో త్రిష గొంగిడి టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. అద్భుతమైన ఫీట్ సాధించడం గొప్ప విషయమన్నారు.
దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా గొంగిడి త్రిష అద్భుతంగా ఆడుతూ వస్తోంది. మెరుగైన రన్ రేట్ ను సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో పాటు కీలకమైన 3 వికెట్లు పడగొట్టింది. బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందింది.
గొంగిడి త్రిష మొత్తం 59 బంతులు ఎదుర్కొంది. 13 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 110 పరుగులు చేసింది. మ్యాచ్ చివరి వరకు నిలిచింది. ఈ టోర్నీలో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించడం విశేషం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం త్రిషను అభినందించారు.