NEWSTELANGANA

అమృత్ టెండ‌ర్ల అవినీతిపై కేటీఆర్ లేఖ

Share it with your family & friends

విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కేంద్రానికి విన్న‌పం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ సంద‌ర్బంగా అమృత్ టెండ‌ర్లలో చోటు చేసుకున్న గోల్ మాల్ పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్రాన్ని కోరారు.

ఈ మేర‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్ , టోచ‌న్ సాహూల‌కు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బావమరిది సృజన్ రెడ్డికి, తమ్ముడి కంపెనీలకి అర్హతలు లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు కేటీఆర్.

వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారంపైన నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గత తొమ్మిది నెలలలో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకు సమాచారాన్ని రాష్ట్ర స‌ర్కార్ తొక్కి పెడుతోంద‌ని ఆరోపించారు.

అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విన్న‌వించారు. ప్రతి టెండర్ ని సమీక్షించాల‌ని, అక్ర‌మమ‌ని తేలితే వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని కోరారు కేటీఆర్.

వెంటనే టెండర్ల తాలూకు ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కోరారు. అర్హతలు లేకున్నా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపైన ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా, స్పష్టత ఇవ్వని తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

ఈ అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉన్నదని ప్రజలు నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు.