NEWSTELANGANA

10 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Share it with your family & friends

పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం అమ‌లు చేయండి

హైద‌రాబాద్ – త‌మ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. హ‌రీశ్ రావు, ఇత‌ర ఎమ్మెల్యేల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా పార్టీ ఫిరాయింపులకు పాల్ప‌డిన స‌ద‌రు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని కోరారు. ఈ మేర‌కు స్పీక‌ర్ కు లేఖ అంద‌జేశారు.

ఇప్ప‌టికే సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని ప‌లు కోర్టులు ఈ విష‌యంలో కీల‌క‌మైన తీర్పులు ఇచ్చాయ‌ని అన్నారు. ఈ విష‌యం స్పీక‌ర్ కు కూడా తెలియ చేశామ‌ని అన్నారు. ఇటీవ‌లే స్పీక‌ర్ కూడా తాను పార్టీ ఫిరాయింపుల‌ను ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పార‌ని, ఆ మేర‌కు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు కేటీఆర్.

త‌మ పార్టీ నేత ఇచ్చిన బి ఫామ్ ల‌తో పోటీ చేసి, గెలుపొందిన వారు అధికార పార్టీ ఇచ్చిన తాయిలాల కోస‌మో లేక త‌మ వ్య‌క్తిగ‌త లాభం కోస‌మో జంప్ అయ్యార‌ని, వారిపై ఫిరాయింపు చ‌ట్టం కింద అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరారు. అంతే కాకుండా త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించ‌డం లేద‌ని ఈ సంద‌ర్బంగా స‌బితా ఇంద్రారెడ్డికి జ‌రిగిన అవ‌మానం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.