అమరరాజా ప్రకటన బాధాకరం – కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి పోకుండా చూడాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అమర్ రాజా సంస్థ చైర్మన్ జయదేవ్ గల్లా ప్రభుత్వం నుంచి సహకారం లేక పోవడంతో తాము సంస్థను ఇతర ప్రాంతానికి తరలించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన బాధాకరమని పేర్కొన్నారు కేటీఆర్.
రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని కోరారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం రాకుండా సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. విచిత్రం ఏమిటంటే తాము ఉన్నప్పుడు కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని, కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఉన్న కంపెనీలు పోతున్నాయని వాపోయారు కేటీఆర్.
కేన్స్ టెక్నాలజీ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లి పోయిందన్నారు. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని, ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లి పోతానని చెబుతుండడం నష్టం కలిగిస్తుందని వాపోయారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టటం ఎంత మాత్రం మంచిది కాదన్నారు కేటీఆర్. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని సూచించారు.
అమరరాజా సంస్థ తెలంగాణ లో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని తెలిపారు.